మైఖేల్ జాక్సన్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. ఆయన కింగ్ ఆఫ్ పాప్ గా పేరుపోందారు. మైఖేల్ జాక్సన్ కేవలం పాటలతోనే కాకుండా తన మూన్ వాక్ డ్యాన్స్ తో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. పాటలు పడుతూనే అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్న మొదటి సింగర్ మైఖేల్ జాక్సన్. నేడు ఆయన మరణించిన రోజు. మైకేల్ జాక్సన్ తుది శ్వాస వదిలి నేటికి 11 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన అభిమనుల గుండెల్లో ఇంకా బ్రతికే వున్నారు. మైఖేల్ అభిమానులు నిత్యం ఆయన పాటలు వింటూ ప్రతి రోజు ఆయనను స్మరించుకుంటుంటారు.ఇక నేడు వర్థంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.
అయితే మైకేల్ మరణించి 11 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆయన మృతిపై అనేక రకాల అనుమానాలు వస్తూనే ఉన్నాయి. నిద్రపోవడం కోసం అధిక మోతాదులో వివిధ రకాల మాత్రలు తీసుకోవడం వలన గుండెపోటుతో మరణించాడని అప్పటి వైద్యులు వివరణ ఇచ్చినప్పటికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు మైఖేల్ జాక్సన్ వర్ధంతి సందర్భంగా వివిధ దేశాల్లో ఉన్న ఆయన అభిమానులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు మైఖేల్ జాక్సన్ తన పాటలతో ప్రపంచాన్ని ఒక ఊపు ఉపేశాడు. సోషల్ మీడియా కూడా లేని సమయంలో ఆయనకు సంబంధించిన వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యేవి. కింగ్ ఆఫ్ పాప్ అనే బ్రాండ్ ఆయనకు చెరగని గుర్తింపు. చరిత్రలో నిలిచిపోయేలా అందరి మనసుల్ని ఆకట్టుకున్నారు.
జాక్సన్ పూర్తి పేరు మైకల్ జోసెఫ్ జాక్సన్ ఆగష్టు 29, 1958 ఆయన జన్మించాడు.. జూన్ 25 2009న మరణించాడు. ఆయన పాడిన “త్రిల్లర్” (Thriller) ఆల్బం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయింది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.
జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్ US$ 300 మిలియన్ల దానధర్మాలు చేశాడట. కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.