వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ చికిత్స కోసం కేటాయిస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిన్న ఎంజీఎంను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి, గురువారం కేయంసీ ఆవరణలోని ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి, పరిశీలించారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ బాధితులు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేయంసి ఆవరణలో 150 కోట్లతో నిర్మించిన కేయంసీలోని ఆసుపత్రిని నాన్ కోవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్ది, రేపటి నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ బాధితులు ఆందోళనకు గురై ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్ధికంగా నష్టపోవద్దని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, మందులు ప్రత్యేకంగా బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 288 పోస్టులు అవసరం ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టి తీసుకెళ్లడంతో.. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంజీఎంలో ఉన్న అక్సిజన్ బెడ్లకు మరో 250 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తీసుకోచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అక్సిజన్ కొరత లేదని, ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స కోసం 1250 బెడ్లు ఉన్నట్లు చెప్పారు. బాధితులు ఎవరు ఆందోళన చెందకుండా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చి ఎంజీఎంలో మెరుగైన సేవలు పొందుతున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంజీఎం సూపరిండెంట్ నాగార్జునరెడ్డి, కేయంసి ప్రిన్సిపాల్ సంధ్యారాణి, వైధ్యాధికారులు, పాల్గొన్నారు.