మెక్సికోలో ఘోర ప్రమాదం..13 మంది మృతి

7
- Advertisement -

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. పసిఫిక్ సముద్రం–గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కలిపే కీలక రైల్వే లైన్‌పై, ఒక్సాకా–వెరాక్రూజ్ మధ్య రైలు పట్టాలు తప్పిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 98 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

అకస్మాత్తుగా రైలు పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఘోర దృశ్యాలు కనిపించాయి. పలువురు ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ట్రాక్ లోపమా, వేగం అధికమా, లేదా సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. అలాగే బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ దుర్ఘటన దేశంలో రైల్వే భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Also Read:పెండింగ్ బిల్స్..మాజీ సర్పంచ్‌ల పోరుబాట

- Advertisement -