ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా దిమ్మతిరిగింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోర ఓటమితో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. మెస్సి లాంటి స్టార్ ఆటగాడు ఉన్న అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన క్రొయేషియా… మెస్సికి కళ్లెం వేయడంలో విజయవంతమైంది.
క్రొయేషియా ఆటగాళ్లు పోటీ పడి గోల్స్ చేస్తుంటే ..మెస్సీ గ్యాంగ్ ఒక్క గోల్ కూడా చేయలేదు. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్ గ్యాంగ్ …. 0-3తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రెబిచ్ (53వ), మోర్దిచ్ (80వ), రకితిచ్ (90+1) ఆ జట్టుకు గోల్స్ అందించారు.
గోల్‌కీపర్ విల్లీ కాబలెరో వైఫల్యం అర్జెంటీనా కొంప ముంచాయి. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా కేవలం మూడుసార్లు మాత్రమే గ్రూప్ దశలో నిష్క్రమించింది. గత 60 ఏళ్లలో గ్రూప్ దశలో అర్జెంటీనాకు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన అర్జెంటీనా దిగ్గజం మారడోనా ,ఆ దేశ అభిమానులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన క్రొయేషియా ఆరు పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది.