విజయ్‌ మెర్సల్‌తో ఇరకాటంలో బీజేపీ..!

234
Mersal stirs up a box-office storm
- Advertisement -

తమిళ సూపర్‌స్టార్‌, ఇళయదళపతి విజయ్ నటించిన మెర్సల్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. తెలుగునాట మినహ ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్‌లపై విడుదలైన విజయ్ ‘మెర్సల్’ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.తమిళనాడులో విజయ్‌కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉండటంతో మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

ఓ  వైపు కలెక్షన్లతో దూసుకెళ్తుంటే మరోవైపు వివాదాలు ముసురుకుంటున్నాయ్. దర్శకుడు అట్లీ రాసిన డైలాగ్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ, డిజిటల్ ఇండియా రాసిన డైలాగ్‌లు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.

సినిమాలో సింగపూర్‌, భారత్‌లో అమలవుతున్న మెడికల్ ట్యాక్స్‌లపై ప్రశ్నలు సంధించాడు. సింగపూర్‌లో 7శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యమందిస్తుంటే ఇండియాలో మాత్రం 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం మాత్రం అందడం లేదన్నారు. అంతేకాదు హాస్పిటల్‌కు వెళితే ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ డైలాగ్‌లు పేల్చారు. ఆరోగ్యానికి హానికరమైన మద్యంపైన మాత్రం జీఎస్టీ వేయలేదని పంచ్‌లు విసిరారు.

దీంతో సినిమాలోని డైలాగ్‌లపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ,డిజిటల్ ఇండియాపై ఉన్న  డైలాగ్‌లను తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ  చీఫ్‌ తమిళ్‌సాయి సౌందరరాజన్ విమర్శించారు.

మెర్సల్ దెబ్బకు కోలీవుడ్ రికార్డులన్నీ బ్రేకవుతున్నాయి. తొలిరోజు రూ.51 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ.1.52 కోట్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు మొత్తం 18-19 కోట్ల బిజినెస్‌ వచ్చినట్లు తెలిపాయి. ఆస్ట్రేలియా, మలేసియా, యూకేలలోనూ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టి మెర్సల్ సత్తా చాటుతుంది.

- Advertisement -