పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇవాళ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. మెప్మా సంస్థ కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యల పైన మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు.
మెప్మా సంస్థ ద్వారా వారికి ఇంకేమీ సహాయ సహకారాలు కావాలో తెలియజేయాలని కోరారు.మెప్మా కింద పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, ముఖ్యంగా మహిళా సోదరీమణుల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా పట్టణాల్లో అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. వీరి సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు త్వరలోనే మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న పేదల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు కార్యక్రమాలపైన, వారికి అందించాల్సిన సహాయ సహకారాల పైన మంత్రి వివిధ పట్టణాల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ లను అడిగి తెలుసుకున్నారు.
దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు, హరితహారం బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా పట్టణాలను ప్రకటించే కార్యక్రమం వంటివి క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు పైన రిసోర్స్ పర్సన్ లనుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పలు పురపాలికలు చేపట్టిన తడి – పొడి చెత్త కార్యక్రమాన్ని అమలు చేయడంలో, అక్కడి పట్టణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో మెప్మాకీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ నేపథ్యంలో వాక్సినేషన్, షౌష్టికాహార కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు వంటి వాటి పట్ల పట్టణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని కోరారు.
మెప్మా పథకం కింద మహిళా సోదరీమణులు చేస్తున్న సేవల గురించి ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉన్నదన్న మంత్రి కేటీ రామారావు, త్వరలోనే మెప్మా ఉద్యోగులతో సమావేశం అవుతారని తెలిపారు. దాదాపు దశాబ్దకాలం పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నా, తమకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వీటిని పెంచాలని రిసోర్స్ పర్సన్లు మంత్రికి విన్నవించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని, మంత్రి మెప్మా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. పట్టణాలు అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మరింత చురుగ్గా పాల్గొనాలని మంత్రి వారిని కోరారు.