మెంతుల గురించి మనందరికి తెలిసే ఉంటుంది. వంటింట్లో కూరల రుచిని పెంచడంలో మెంతులు ఎంతోగానో ఉపయోగ పడతాయి. అయితే మెంతులు కేవలం రుచిని పెంచడంతో పాటు ఎన్నో రోగాలకు నివారిణిగా కూడా పని చేస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కేవలం మెంతులలోనే కాకుండా మెంతి ఆకులు, కాండం.. ఇలా అన్నిట్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ సంబంధిత వ్యాధులలో మెంతి ఆకులను మెడిసన్ గా వాడుతూ ఉంటారు. మెంతి ఆకులను రోజుకు రెండుసార్లు 4 నుంచి 5 ఆకుల చొప్పున తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట.
ముఖ్యంగా కడుపులోని వ్యర్థాలను బయటకు పంపించి పేగులను శుభ్రం చేయడంలో మెంతి ఆకులు సమర్థవంతంగా పని చేస్తాయట. ఇక మెంతి ఆకులను రసంగా చేసుకొని ప్రతిరోజూ రాత్రి భోజనానికి ముందు సేవిస్తే.. నిద్రలేమి సమస్య దూరమై చక్కగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకు కూర ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే.. మూత్రనాళ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అలాగే రక్త నాళాల పనితీరు మెరుగు పరచడంలోనూ, శ్వాస వ్యవస్థను క్రమబద్దీకరించడంలోనూ మెంతి ఆకు కూర చక్కగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక మెంతి ఆకులను పేస్ట్ లా చేసుకొని తలకు రాసుకోవడం వల్ల చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా మెంతి ఆకులు చక్కటి పని తీరును కనబరుస్తాయి. పాలలో కొద్దిగా మెంతి పిండిని కలిపి ముఖానికి రాసుకొని పది నుంచి పదిహేను నిముషాల తరువాత చన్నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతి వంతంగా మారుతుంది. ఇలా మెంతి ఆకుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కాబట్టి ఆయా సమస్యలతో బాధ పడే వాళ్ళు మెంతి ఆకులపై ఒక కన్నేసి ఉంచాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:కేశ సౌందర్యం కోసం..