ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా హాజరయ్యారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి. కాగా నామినేషన్ వేసేందుకు ముందుగా మీరా కుమార్ …ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అంతకముందు తొలిసారిగా మీడియాతో మాట్లాడిన మీరా రాష్ట్రపతి ఎన్నిక దళితుల మధ్య పోటీ కాదనీ సైద్ధాంతిక అంశాల మధ్య జరుగుతున్న సంగ్రామమని మీరా కుమార్ అభివర్ణించారు. రాష్ట్రపతి ఎన్నికను దళిత్ వర్సెస్ దళిత్’గా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన మీరా కుమార్ ఇప్పటికైనా కుల వ్యవస్థను పాతిపెట్టాలని అన్నారు. తమ పోరును కులాల మధ్య జరుగుతున్న పోటీగా చూస్తే అది రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుందని వ్యాఖ్యానించారు. తన ఎన్నికల ప్రచారం గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభిస్తానని మీరా తెలిపారు.