మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈసినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని 2020 జులై 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక అందరి దృష్టి చరణ్ తర్వాతి సినిమాపైనే ఉంది. ఇక చరణ్ తర్వాత మూవీ ఏ దర్శకుడితో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం చరణ్ తర్వాతి సినిమా మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో ఉండనుందని తెలుస్తుంది. ఇటివలే చరణ్ కు వంశీ ఒక లైన్ చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతో పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాడట చరణ్. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి సినిమా విడుదల తర్వాత వంశీ ఈస్క్రీప్ట్ ను డెవలప్ చేయనున్నాడట.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఎవడు సినిమా తెరకెక్కింది. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చరణ్ చివరగా నటించిన వినయ విధేయ రామ చిత్రం ప్లాప్ ను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా విడుదలయిన తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడా లేదా దాంతో పాటు చేస్తాడో వేచి చూడాలి.