హైదరాబాద్ నగరంలో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు. ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ఈ డ్రైవ్ చేపట్టారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ దవాఖానలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి.
ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకు కోసం హైటెక్స్‌లో మొత్తం 3 హాళ్లలో 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. డ్రైవ్ ప్రారంభించిన తొలిగంటలోనే 5 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్ కోసం జనాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.