ఖైదీ ఫీవర్‌తో తెలుగు రాష్ట్రాలు మార్మోగిపోతున్నాయి. తొమ్మిది సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెరమీదకు వచ్చిన ఫ్యాన్స్…మెగా ఫ్యామిలీకి నిజమైన సంక్రాంతి నందించాడు. ఉదయం 4 గంటల నుంచే థియేటర్లు బాస్ ఈజ్ బ్యాక్ అన్న నినాదాలతో మార్మోగిపోయాయి. సినిమాకు హిట్ టాక్ రావటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటారు.
9ఏళ్ల తర్వాత చిరుని వెండితెరపై చూసిన అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. ఆయన వేసే స్టెప్పులకు థియేటర్లు మారు మ్రోగాయి. ఇక ఫైట్ సన్నివేశాలలో బాస్ బ్యాక్ అనేలా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే చిరు ఎంట్రీ అదిరిపోయిందంటూ అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.
‘ఖైదీ నంబర్ 150’ని అభిమానుల మధ్య చూసేందుకు మెగా ఫ్యామిలీ కదిలొచ్చింది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో సినిమాను వీక్షించేందుకు చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖలు వచ్చారు. వీరితో పాటు హీరో అల్లు అర్జున్ తన సతీమణితో కలసి వచ్చారు. థియేటర్ వద్ద వీరిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం అభిమానులతో కలిసి సందడి చేశారు. స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు సైతం కూకట్ పల్లిలోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి ఖైదీ మూవీని ఎంజాయ్ చేశారు.
ఇక టాలీవుడ్ ప్రముఖులు చిరుకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. నాగార్జున, మోహన్ బాబు,మంచు మనోజ్,అల్లు శిరీష్, నిఖిల్, నిషా అగర్వాల్, రామ్ పోతినేని, హరీష్ శంకర్ తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. దాదాపు 4500 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసినట్లు తెలిసింది. సంక్రాంతి బరిలో నిలిచిన మొదటి సినిమా హిట్ టాక్ రావటంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. బాస్ ఈజ్ బ్యాక్ అన్న పదాన్ని చిరు నిజం చేశారని చెబుతున్నారు.