యుకేలో ఘనంగా మెగా బతుకమ్మ

263
Mega Bathukamma celebrations at uk
- Advertisement -

తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ ఎన్నారై ఫోరం ఇంగ్లాడులో ప్రవాస తెలుగు వారికోసం జాతర లాంటి వాతావరణాన్ని హౌన్‌స్లా లోని ఇండియన్ జిమ్‌ ఖానా గ్రౌండ్స్ లో  ఏర్పాటు చేసింది.  ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 2000 కి పైగా తెలంగాణా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తెలుగు ఆడపడచులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేత బట్టుకుని TeNF ఏర్పాటు చేసిన గ్రామీణ పండుగ వసతులతో నిండిన ఇండియన్ జిహ్‌ఖానా గ్రౌండ్స్ కి చేరుకొని , ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆ తర్వాత రంగు రంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను  మధ్యలో  వుంచి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!! ” అని గొంతెత్తి పాడుతూ తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో సాంప్రదాయ బద్దంగా తెలంగాణా గ్రామీణ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా వేడుకలను జరుపుకోవటం అందరిని ఆకట్టుకుంది.

చిన్నారులు సైతం చిన్న చిన్న బతుకమ్మలతో వేడుకలకు కొత్త అందాన్ని తెచ్చారు. మగవారు కట్టే కోలాటం తో గ్రామీణ పల్లె గీతాలకు లయ బద్దంగా నర్తించారు. అనంతరం బతుకమ్మలని నిమజ్జనం చేసి , ప్రసాదాన్ని పంచుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి జమ్మి ని ఇచ్చి పుచ్చుకున్నారు.

చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నం , కప్ రైడ్స్ , బౌన్సీ కాసిల్ , మహిళల కోసం ఏర్పాటు చేసిన నగలు , వస్త్ర ప్రదర్శనలు , తినుబండారాల దుకాణాలు ,విద్యుత్ దీప కాంతుల వెలుగు  జిలుగులు తెలంగాణా జాతరను తలపించిందని స్వదేశంలోని గ్రామాలలో బతుకమ్మ జరుపుకున్నట్టుగా ఉందని దానికోసం తెలంగాణ ఎన్నారై ఫోరం చేసిన ప్రయత్నాన్ని
అందరూ ఎంతగానో అభినందించారు.

తెలంగాణ నించి ఈ మహా బతుకమ్మ వేడుకలలో ముఖ్య అతిధులుగా పాల్గొనటానికి  ఎమ్మెల్యే కొండా సురేఖ,ఎమ్మెల్సీ కొండా మురళి, ప్రకాష్‌ గౌడ్ ,గుండవరపు దేవీప్రసాద్ (తెలంగాణ రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌),నాగేందర్  గౌడ్ (తెలంగాణ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్  కార్పొరేషన్ చైర్మన్ ), తెలుగు సినీ దర్శకులు  సురేందర్  రెడ్డి  మాట్లాడుతూ బాద్యత గల తెలంగాణ బిడ్డలు గా, నాటి ఉద్యమం నుండి నేటి పునర్నిర్మాణం వరకు అన్నింట్లో ముందున్న ఎన్నారై ఫోరమ్, తెలంగాణ అస్థిత్వాన్ని మరియు సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు .

ఉత్తమ బతుకమ్మ లకు  ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే రాఫెల్ లక్కీ డ్రా లో గెలిచినవారికి కూడా ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ  కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

- Advertisement -