స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలను, శిథిలాలను ప్రాసెసింగ్ చేసి, వాటి నుండి 90శాతం వరకు పునర్ వినియోగానికి ఉపయోగపడేవిధంగా వివిధ రకాల మెటీరియల్‌ను ఉత్పత్తిచేసే లక్ష్యంతో జీడిమెట్లలో సి అండ్ డి వేస్ట్ ప్లాంట్‌ను నెలకోల్పుతున్నట్లు జిహెచ్ఎంసి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇఇ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సహజ వనరులను గరిష్టంగా వినియోగించుటకు రీ సైక్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఈ ప్లాంట్ పనితీరుపై నిర్వహించిన ప్రెస్‌టూర్‌లో ట్రయల్ రన్ ప్రక్రియను చూపించి, ఆయా యంత్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా సి అండ్ డి ఇఇ మోహన్ రెడ్డి, నిర్మాణ సంస్థ రాంకీ ఎన్విరో బయోమెడికల్ వేస్ట్ బిజినెస్ హెడ్ ఎ.సత్యలతో కలిసి మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలను ఒక పద్దతిలేకుండా నాలాలు, చెరువులలో నింపుటవలన నిరుపయోగంగా మారుతున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి టి.ఎస్.ఐ.ఐ.సి ద్వారా ప్రభుత్వం 17 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. దానిలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మెయిన్ ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. మిగిలిన స్థలాన్ని గ్రీనరి, డంపింగ్‌కు ఉపయోగించున్నట్లు తెలిపారు. రూ. 15కోట్ల పెట్టుబడి వ్యయంతో పిపిపి – బిఓటి పద్దతిలో జీడిమెట్ల ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యర్థాలలో మట్టి, ఇసుక, గ్రావెల్, బ్రిక్స్, కాంక్రీట్, మెటల్, ప్లాస్టిక్, ఉడ్ ఇతర మెటీరియల్ కలిసి ఉంటుందని తెలిపారు. దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ చేసి పునర్ వినియోగానికి ఉపయోగపడేవిధంగా ఇసుక, మెటల్, గ్రావెల్ లను వేరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాసెసింగ్‌లో వెలువడిన మెటీరియల్‌తో తయారుచేసిన ఇటుకలను సి అండ్ డి ప్లాంట్ ప్రహరీగోడకు, టైల్స్‌ను వాక్‌వేలకు ఉపయోగించినట్లు తెలిపారు. ప్రాసెసింగ్‌లో వెలువడిన ఇసుకను, చిప్స్‌ను, గ్రావెల్‌ను అంతర్గత రోడ్లు, నిర్మాణ పనుల్లో లోయర్ లేవల్‌గా ఉపయోగించవచ్చని తెలిపారు. 2018 జనవరి 22న మొదలుపెట్టిన జీడిమెట్ల ప్లాంట్ పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజలందరికీ సౌలభ్యంగా ఉండేందుకై నగరానికి నాలుగువైపులా ఒకొక్కటి 500 టన్నుల సామర్థ్యంతో జీడిమెట్లతో పాటు కొత్వాల్‌గూడ, మల్లాపూర్, ఫతుల్లాగూడలలో సి అండ్ ప్లాంట్లు నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. అయితే మల్లాపూర్‌కు బదులు జవహర్‌నగర్‌లో 32 ఎకరాలను ఇటీవలే ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఫతుల్లాగూడలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
జీడిమెట్ల ప్లాంట్ సామర్థ్యం 750 టన్నుల సామర్థ్యంతో నిర్మించుటకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ముందస్తుగా అనుమతి పొందిన అనంతరమే పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రీసైక్లింగ్ ద్వారా 97శాతం నీటిని పునరువినియోగించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీచేసిన నిబంధనలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరంన్నర కాలంలో 7లక్షల 40వేల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తరలించినట్లు తెలిపారు. దానిలో 2లక్షల 17వేల మెట్రిక్ టన్నులను జిడిమెట్ల ప్లాంట్‌కు తరలించి, ఇక్కడ ఉన్న క్వారీని నింపి చదును చేసినట్లు తెలిపారు. గత మూడు నెలల కాలంగా ఈ ప్లాంట్ పనితీరును క్రమబద్దీకరించేందుకు భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాసెసింగ్‌లో వెలువడిన ఉత్పత్తుల నాణ్యతకు డోకాలేదని తెలిపారు. మార్కెట్ ధరలకంటే 25శాతం తక్కువ రేటుకే ఈ ఉత్పత్తులను నిర్మాణదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రాసెసింగ్‌లో వెలువడిన సిల్ట్‌ను ల్యాండ్ ఫిల్లింగ్‌కు కూడా ఉపయోగించవచ్చునని తెలిపారు.
రీసైక్లింగ్‌లో వెలువడిన ఉత్పత్తులకు పూర్తిస్థాయిలో మార్కెటింగ్ లేనందున తక్కువ ధరకు విక్రయించుటకు వయబిలిటి గ్యాప్ ను భర్తిచేసేందుకు ప్రతి టన్నుకు కొంత మొత్తాన్ని జిహెచ్ఎంసి భరిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను సేకరించుటకు నగరంలోని వివిధ ప్రాంతాలలో కలెక్షన్ పాయింట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణదారులు, బిల్డర్స్‌కు నిర్మాణ, శిథిలాల వ్యర్థాల మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రవాణా టిప్పర్లను ఎంప్యానల్ చేసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణా, డంపింగ్ లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ అంశంపై బిల్డర్స్ అసోసియేషన్, క్రేడాయి ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ వ్యర్థాలు, శిథిలాల సేకరణకై ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మైజిహెచ్ఎంసి మొబైల్ యాప్, ఆన్‌లైన్ ద్వారా గత సంవత్సరంన్నర కాలంలో 422 విజ్ఝాపనలు ఎస్కలేట్ అయినట్లు తెలిపారు. వాటన్నింటిపై జిహెచ్ఎంసి అధికారులు స్పందించి వ్యర్థాలను తరలించుటకు సహకరించినట్లు తెలిపారు.