జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి కార్యక్రమం

419
ministererrabelli
- Advertisement -

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మొదటి దశ పల్లె ప్రగతి తరహాలోనే రెండో దశ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతిలో వైకుంటదామాన్ని, డంపింగ్ యార్డును, నర్సరీని నిర్మించేలా కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండోదశ పల్లె ప్రగతి అమలు ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ ఎం.రఘునందన్ రావు, సెర్ప్ సీఈవో పౌసుమిబసులతో కలిసి అన్ని జిల్లాల జెడ్పి సీఈవోలు, డిపివోలు, డిఆర్డీవోలు, డీఎల్ పీవోలు, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులతో హైదరాబాద్ లోని టీఎస్ఐఆర్డీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు గతంలో ఎవరూ ఇంతటి గుర్తింపు ఇవ్వలేదు. అన్ని స్థాయిలోని అధికారులకు పదోన్నతులు ఇచ్చారు. జీపీల్లోని కార్మికులకు రూ.8,500 వేతనం ఖరారు చేశారు. అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి(30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి దశ పల్లె ప్రగతిని నిర్వహించాం. అన్ని గ్రామాల్లో అద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయి. పల్లెల్లో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. అయితే పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించే విషయంలో కొన్ని జిల్లాల్లో అలసత్వం నెలకొంది. పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ. జనవరి 2 నుంచి రెండో దశ పల్లె ప్రగతి కార్యాక్రమం నిర్వహించాలని నిర్వహించేందుకు సిద్ధం కావాలి. మంత్రుల ఆధ్వర్యంలో కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్ పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నద్ధ సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 28లోపు ఈ సమావేశాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామపంచాయతిలలో వైకుంటదామాలను, డంపింగ్ యార్డుల నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలను నిర్మించేలా ప్రణాళికలు ఉండాలి. ప్రజలలో అవగాహన పెంచాలి. ప్రతి గ్రామపంచాయతికి కచ్చితంగా ఒక నర్సరీ ఏర్పాటు చేయాలి. వర్షాకాలం మిగిసింది. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ఏర్పాట్లు చెయ్యాలి. పారిశుధ్య నిర్వహణ చాలా ముఖ్యమైనది. దీనికోసం అవసరమైన చోట చట్ట ప్రకారం జరిమానాలు విధించాలి.

ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియను సత్వరం ముగించాలి. ఉపాధిహామీ పథకాన్ని సమగ్రంగా వినియోగించుకోవాలి. గ్రామపంచాయతిల వారీగా అవసరమైన పనులను గుర్తించాలి. డీఆర్డీవోలు ఈ విషయంలో చొరవతో పనిచేయాలి. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ కచ్చితంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే పని చేయాలి. ఏ నిధులతో ఏ పనులను చేపట్టాలనే విషయంలో సర్పంచులకు, ఉప సర్పంచులకు అధికారులు అవగాహన కల్పించాలి. కరెంటు బిల్లులు చెల్లించాలి. రెండో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేసి ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. పరిశుభ్రత నిర్వహణ విషయంలో ఒకింత కఠినంగానే ఉండాలి. వైకుంటదామం ఖర్చును రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు ప్రభుత్వం పెంచింది. డంపింగ్ యార్డుల నిర్మాణ వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. వీలయినంత వరకు అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణాలను పూర్తి చేయాలి. దాతలు గ్రామాలకు విరాళాలు ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దాతల వివరాలను ప్రతి గ్రామపంచాయతిలో అందరికి తెలిసేలా పెట్టాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

వైకుంటదామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడుగుంతల నిర్మాణంలో పనితీరు సరిగా లేదని మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ జిల్లాల అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అమలులో ఏమాత్రం అలసత్వంగా వ్యవహరించినా సహించేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. జనవరి 2న గ్రామసభ నిర్వహణతో పల్లె ప్రగతి కార్యక్రమం మొదలవుతుందని కమిషనర్ ఎం.రఘునందన్ రావు తెలిపారు. ఈ గ్రామసభలో పల్లె ప్రగతి మొదటి దశ నిర్వహణ, చేపట్టిన పనులు, ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ఈ గ్రామసభలో అందరికీ చెప్పాలని అన్నారు. రెండో విడత పల్లె ప్రగతిలో చేపట్టే పనులను వివరించాలని చెప్పారు.

- Advertisement -