ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమైన మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. శనివారం రాత్రి సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో నాలుగు రోజుల జాతరకు తెరపడనుంది. కోరిన కోర్కెలు తీర్చే తమ ఇలవేల్పులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు నెల రోజుల నుంచి భక్తులు తల్లుల దర్శనం కోసం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. భక్తులు నిర్విరామంగా అమ్మవార్లను అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. వన దేవతలను ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తమవుతుంది. సమ్మక్క సారలమ్మల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు.ఈ మహాజతరకు సుమారు రెండు కోట్లకు మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారులు వెల్లడించారు.