మన పోలీసులు…మనసున్న మారాజులు

647
medak police
- Advertisement -

పోలీసు శాఖ అంటేనే మానవత్వం లేని శాఖ.ఖాకీ డ్రెస్‌ వెనుక ఉంది కాఠిన్యమే. మానవత్వం కనీసం జాలి,దయ ఇవేవి ఉండవు..ఇది పోలీసుల గురించి ప్రజలకున్న అభిప్రాయం. ఇదంతా గతం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది..పోలీసుల పనితీరులో మార్పు వచ్చింది. నాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే భయపడే ప్రజలకు భరోసానిచ్చి ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునే ధీమా కల్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో వారి మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పులతో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ సంఘటన. మెదక్ జిల్లా చేగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకెదురైన అనుభవాన్ని వివరించి ప్రజల్లో మరింత చైతన్యం కల్పించారు. ఆ వ్యక్తి తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించగా ఇప్పుడా వార్త వైరల్‌గా మారింది.

ఆ వ్యక్తి రాసిన వార్త యథాతథంగా…పొద్దుగాల్నే హైదరాబాద్ లో ఉన్న మా చిన్నాన్నకి ఆరోగ్యం బాగా లేదని, జ్వరంతో హాస్పిటల్ల చేర్పించామని మా చిన్నమ్మ నుండి ఫోన్ రావటంతో చేగుంట మండలం రెడ్డిపల్లె నుండి నేను నా చెల్లితో కలిసి బైక్ పై హైదరాబాద్ కి బయలుదేరాం. నేను ఒక్కణ్ణే అయితే బస్సులో వెళ్లి అక్కడ కొంపల్లిలో దిగి అక్కడి నుండి మళ్ళ ఏదో ఒక బస్ పట్టుకొని వెళ్ళేవాణ్ణేమో కానీ నా చెల్లె కూడా ఉండటంతో అక్కడ దిగి హైదరాబాద్ లో వేళకి రాని బస్సులతో వేగలేక.. ఒకవేళ వేళకు వచ్చినా ఆ బస్సుల్లో వేళ్ళాడలేక బైకుపైన వెళ్తేనే లోకల్లో తొందరగా కొన్ని పనులు చేసుకోవచ్చని అనుకోని ఇంటికాడ ఇంత తిని 12 గంటల కల్లా బయలుదేరి రెండు గంటల్లో చేరుకున్నాం.

కూకట్ పల్లి లోని ఆసుపత్రికి వెళ్లి మా చిన్నాన్న వాళ్ళని కలిసి ఆయన బాగోగులు తెలుసుకొని చీకటి పడకముందే బయలుదేరాలని నిర్ణయించుకొని మళ్ళి తెల్లారగానే పొలంలో వరి నాట్లు, చేను పనులు ఉండటంతో చిన్నాన్నతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక మళ్ళా అమ్మని తీసుకొని ఇంటికి వస్తానని చెప్పి సెలవు తీసుకొని చెల్లెతో కలిసి ఆసుపత్రి నుండి బయటకి వచ్చాను.

బయలుదేరేటప్పుడు కాస్త ఆకాశంలో మబ్బు గానే ఉంది. వాన పడతదన్నట్టుగానే అనిపించింది. కానీ మళ్ళి తెల్లారి పొలం పనులు గుర్తొచ్చి మరో ఆలోచన లేకుండా బండి స్టార్ట్ చేశాను. చెల్లె కూడా అక్కడ దగ్గర్లో కాలేజీలో చదువుకుంటున్నా కానీ అప్పుడో ఇప్పుడో వరి నాట్లప్పుడు పొలం పనుల్లో సాయం చేస్తది. మళ్ళి దాన్ని ఇక్కడే ఉంచి పోతే తెల్లారి అమ్మకి ఇబ్బంది అయితదన్న ఆలోచన వచ్చి చెల్లెని కూడా ఎక్కించుకొని పొలంలోని మోటారు పంప్ సెట్ కి సంబంధించిన సామాను అవసరం ఉండటంతో దారిలో కొనుక్కొని సుమారు 6.30 గంటల సమయంలో ఊరికి బయలుదేరాం.

నిజామాబాదు హైవే మీదుగా మేడ్చల్ నుండి వెళ్తున్నాం. వెళ్తుండగానే చీకటి పడింది. జోరున వాన కూడా అందుకుంది. చేసేదేం లేక అక్కడక్కడ ధాబాల దగ్గర ఆగుతూ అలానే వెళ్తూ ఉన్నాం. హైవే రోడ్డు రాత్రి సమయం అందునా వర్షం పడుతుంది. హైదరాబాద్ లో ఉండి మబ్బుల్నే వస్తే మంచిగుండని చెల్లె అనగానే కరెక్టే అనిపించింది. కానీ బయలుదేరకా ఇంకేముంది అనుకోని ఇంకో 20 కిలోమీటర్లు పోతే చేగుంట క్రాస్ రోడ్డు రానే వచ్చే అని చెల్లెకు సర్ది చెప్పిన.

వానా ఎదురుంగా మొహం మీదనే కొడుతుంది నాకు హెల్మెట్ ఉంది కానీ చెల్లెకి కప్పుకొనికి ఏది లేక ఇబ్బంది అయితున్నట్టు గమనించి మెల్లగా వెళ్తున్న. అంతలో పక్క నుండే కలర్ కలర్ లైట్ల వెలుగులు కనబడుతున్నాయి.

ఈ కలర్ లైట్లు ఏందని పక్కకి తిరిగిన్నో లేదో సైరెన్ సౌండ్ వేసి ఆపమని చెప్పిర్రు. ఏమైందో ఏమో అని ఆపిన. చూస్తే సర్కారు మొన్ననే కొత్తగా ఇచ్చిన పోలీస్ బండి. పొద్దుగాల వచ్చే ఆగంల పడి బండి కాయిదాలు యాది మర్చిపోతి ఎట్లా రా దేవుడా అని మనసుల అనుకుంటున్న. బండిల కెళ్ళి ఇద్దరు పోలీసోళ్ళు దిగిర్రు. అదే వానల్నే నా కాడికి వచ్చి ఎం తమ్మి ఎక్కడికి పోతున్నవ్ అని అడిగిర్రు… చేగుంట కాడ రెడ్డిపల్లెకు మా ఊరికి పోతున్న సార్ అని చెప్పిన, వెనక ఆడపిల్ల ఏమైతదని అడిగిర్రు నా చెల్లె సార్ అని చెప్పిన.. వెంటనే ఒక పోలీసాయన తమ్మి వర్షం పడతాంది రాత్రి ఆడపిల్లతో బండి మీద ప్రయాణం ఏంది తమ్మి అని అన్నడు. నేను ఎం సప్పుడు చేయలే. సరే మేము చేగుంట మీద నుండే మెదక్ పోతున్నాం. మీ చెల్లెని అక్కడ రెడ్డిపల్లె కాడ దింపి పోతాం. నువ్వు బండి మీద మెల్లంగా రా అని ఒక పోలీస్ చెప్పిండు. నా మనసు ఒప్పుకోలే. వెంటనే ఎం కాదు సార్ మేమే మెల్లగా పోతాం అని చెప్పిన, వెంటనే ఇంకొక పోలీసాయన మేము భద్రంగనే దించుతాం తమ్మి ఎం భయపడకు అని చెప్పి ఆయన ఐడి కార్డు కూడా చూయించిండు.

నాకు నోట్ల కెళ్ళి మాట అత్తలేదు. అప్పటికే నా చెల్లె బండి మీద నుండి దిగి పక్కకు ఉంది. చెల్లెను రా అమ్మ అంటూ తీసుకొని పోయి పోలీస్ బండ్ల ఎక్కించుకున్నరు. పోలీస్ బండి మీద మెదక్ అని రాసి ఉంది. నాకు ఒకటే వణుకుతాంది. అసలు మనసు ఒప్పుకుంటలేదు. చూస్తుండగానే చెల్లెను ఎక్కించుకొని పోలీస్ బండి ముందుకు కదిలింది.

నేను కూడా బండి ఛాల్ చేసి వాళ్ళ వెనకాల్నే వెళ్ళటానికి ప్రయత్నించిన కానీ వాన పడవట్టే అందులో ఎదురుంగా గాలి… నా బండి టైర్లు కూడా మంచిగా లేవు. వాళ్ళ బండి కనిపించనంత దూరం పోతనే ఉంది. నాకు మనసులో గుబులు ఐంతాంది వట్టిగనన్న పోరిని బండిల పంపితిని వాళ్ళు నిజం పోలీసోల్లొ నకిలీ పోలీసోల్లో వేషం వేసుకొని రావచ్చు.. నిజం పోలీసోల్లోయినంత మాత్రాన పైలంగా దింపుతరన్న గ్యారెంటీ ఏంది… అసలు ఇందంతా ఏందీ బతుకు.. కాయ కష్టం చేసుకొని బతికేటోల్లం ఏందీ తిప్పలు ఇంటికి పోతే అవ్వ ఆగమైతది… ఇవ్వన్నీ మనసులో ఆలోచనలు, అనుమానాలతో రోడ్డు సక్కగా కనబడతలేదు.

దుఃఖం వస్తాంది కానీ ఆపుకుంటున్న. ఏదైనా జరగరానిది జరిగితే పాణం తీసుకునుడే తప్ప మరో మార్గం లేదు అనుకుంట మెల్లమెల్లగా ఎట్లో ఒకట్ల చేగుంట కాడికి చేరుకున్న… చేగుంట పోలీస్ స్టేషన్ ముందు నుండే మా ఊరికి పోవాలే. పోలీస్ స్టేషన్ కి పోయి గిట్ల గిట్ల జరిగిందని చెప్పాల్నా అని అనుకున్న కానీ ముందుగాల ఇంటికయితే పోయి చెల్లె వచ్చిందో రాలేదో తెలుసుకుందామనుకొని బండి అట్లనే పోనిచ్చిన… ఇంటికాడికి ఫోన్ చేద్దామంటే ఉన్న ఒక్క సెల్ ఫోన్ నా దగ్గర్నే ఉండే. నాకేమో ఒకటే గుబులు…. జప్ప జప్ప బండి ఉరికిచ్చిన… 10 నిమిషాల్లో ఇంటికాడున్న.. ఇంటికి పోంగనే చెల్లె పళ్లెంల అన్నం పెట్టుకుంట కనబడ్డది. నేను పోంగనే.. అన్నా ఇప్పుడే వచ్చి స్నానం చేసి అన్నం తింటాన్నే అన్నది. నాకు చెల్లెని చూడంగానే పాణం సల్లవడ్డది.

చెల్లెని అడిగిన ఎక్కడ దింపిర్రే గా పోలీసోళ్ళు అని… వెంటనే చెల్లె ఇంటికాడ దింపిర్రు… పంచాయితీ ఆఫీసు కాడా దిగి నడుచుకుంటా పోత సార్ అని అన్న కూడా వాళ్ళు ఊకోలే అన్న. ఇంటికాడ దింపి ఇంట్ల అమ్మ తలుపు తీసేదాకా ఉండి ఇంట్లకి పోయినంకనే బండి మలుపుకొని పోయిర్రు అని చెప్పింది. అంతలో మా అవ్వ అందుకొని పోలీసోల్ల బండి వచ్చేసరికి ఏమైందో ఏందో అని నేను ఆగం పడితిని పక్కింట్ల కెళ్ళి రాములు పెద్దబాపు వచ్చి ఏమాయెనని ఉరుక్కుంటా ఉరుక్కుంటా వచ్చే… చెల్లె గిట్ల గిట్ల జరిగిందని అసలు విషయం చెప్తే అప్పుడు మనసు కుదుటపడ్డది బిడ్డ అని చెప్పింది. గప్పుడు నేను బుక్కెడంత బువ్వ తిని ఆ పోలీసోల్ల గురించి ఆలోచించిన… అప్పుడనుకున్న నాలో నేనే… మన పోలీసోళ్ళు  కూడా మనసున్న మారాజులని..తనకెదురైన అనుభవాన్ని వివరించారు.

- Advertisement -