సెల్ఫీ రాజా, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడ్డ హీరో అల్లరి నరేష్…. తన తాజా చిత్రం మేడ మీద అబ్బాయిపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన్నచంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా నిఖిలా విమల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాతో నరేష్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం…
కథః
శీను(అల్లరి నరేష్) జీవితం అంటే సీరియస్ లేకుండా ఉండే కుర్రాడు. మధ్య తరగతి కుటుంబీకులైన శ్రీను తల్లిదండ్రులు శీను తాహతకు మించి అప్పు చేసి ఇంజనీరింగ్ చదివిస్తారు. కానీ చదువు మీద శ్రద్దలేని శీను ఇంజనీరింగ్‌లో ఫెయిల్ అవుతాడు. తల్లిదండ్రులు తిడుతున్న పట్టించుకోకుండా అవారాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో శీను పక్క ఇంట్లోకి సింధు(నిఖిలా విమల్) అద్దెకు దిగుతుంది. శీను, సింధుని లైన్‌లో పెట్టడానికి తన ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ సింధు శీనుని పట్టించుకోదు. ఇలాంటి తరుణంలో శీను, చిన్ననాటి స్నేహితుడు బాబ్జీ(హైపర్ ఆది)తో కలిసి ఓ షార్ట్‌ఫిలిం చేస్తాడు. దాంతో ఎలాగైనా పెద్ద డైరెక్టర్ అయిపోవాలని కలలు కంటాడు. అయితే ఆ కలలు కూడా నీరుగారిపోతాయి…ఈ క్రమంలో తనను తాను నిరూపించుకోవడానికి శీను ఏం చేస్తాడు? అసలు సింధు ఏమౌతుంది? చివరకు శీను, సింధును కలుసుకుంటాడా? అన్నది తెరమీద చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
స్పూఫ్‌లు,ఇమిటేషన్‌లతో ఇప్పటివరకు అలరిస్తు వచ్చిన నరేష్ ఈ సినిమాలో మాత్రం అలాంటి జోలికి వెళ్లలేదు. పూర్తిగా ట్రాక్ మార్చి తన ఒరిజినల్ షేడ్‌ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరోయిన్‌గా తొలి సినిమా అయిన నిఖిలా విమల్ .. డీసెంట్‌లుక్‌తో కట్టిపడేసింది. ఇక సినిమాకు మరో హైలైట్ హైపర్ ఆది. జబర్‌దస్త్ తరహా పంచ్‌లు, ప్రాసలు, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ ప్రైవేట్ డిటెక్టివ్‌గా చక్కగా నటించాడు. సింధు, శీను, బాబ్జీకి సహాయపడే పాత్రలో అవసరాల మెప్పించాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో నరేష్ క్యారెక్టర్ ఎలివేషన్‌కే ఎక్కువ సమయం తీసుకోవడం ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుంది. తెలుగు నేటివిటి మిస్సయింది. సినిమాలో చివరి పదిహేను నిమిషాలు తప్ప, మరేం ఉండదు. సోషల్ మీడియా, దాని దుష్‌ప్రభావం అనే చిన్న పాయింట్‌ను పట్టుకుని సాగతీశాడు దర్శకుడు.
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. షాన్ రెహమాన్ సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీలా పడింది. దర్శకుడు ప్రజిత్ మలయాళంలో ఉన్న సినిమాను తెలుగులో అలాగే తీయడానికి ప్రయత్నించాడు. దీంతో కథలోని సోల్ మిస్సయ్యింది. ఉన్ని ఎస్.కుమార్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
కామెడి హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నరేష్…ఈసారి స్పూఫ్‌లు, ఇమిటేషన్‌లు చేయకుండా చేసిన సినిమా మేడ మీద అబ్బాయి. హైపర్ ఆది కామెడీ సినిమాకు ప్లస్ కాగా ఒకే పాయింట్ పట్టుకుని సినిమాను సాగదీయడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా అల్లరి నరేష్ సినిమాలను అమితంగా ఇష్టపడేవారు ఓ సారి చూసే సినిమా మేడ మీద అబ్బాయి.
విడుదల తేదీ: 08/09/2017
రేటింగ్ : 2. 5/5
నటీనటులుః అల్లరి నరేష్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్
సంగీతం : షాన్ రెహమాన్
నిర్మాతః బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం : జి.ప్రజిత్