దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వ్యాధి చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు 233 మీజిల్స్ కేసులు నమోదుకాగా గత రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని భావిస్తున్నారు.
గత 24 గంటల్లో 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబైతోపాటు సమీపంలోని మాలేగావ్, భివండి, థానే, నాసిక్, అకోలా, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
చిన్నపిల్లల్లో సోకే ఈ వ్యాధిని నియంత్రించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తుంటారు. 9-15 నెలల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై పరిధిలో అర్హత కలిగిన వారిలో 41 శాతం మంది చిన్నారులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..