దేశంలోనే మొట్టమొదటి సారి అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో చెంగిచర్ల వద్ద నిర్మిస్తున్న రెండరింగ్ ప్లాంట్‌ను సోమవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ మహ్మద్ సలీమ్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి రెండరింగ్ ప్లాంట్ ట్రాయల్‌రన్‌ను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపుదలకు, భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది.
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్న అంబర్‌పేట, న్యూ బోయిగూడ, రాంనాస్‌పురలలోని కబేళాలు, అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమంగా విక్రయిస్తున్న మాంసం, చికెన్, మటన్ షాపుల నుండి మిగిలిన మాంస వ్యర్థాలను చెంగిచర్ల రెండరింగ్ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తి అయిన బై ప్రొడక్ట్ పౌల్ట్రి, అక్వా కల్చర్‌లో హై ప్రొటీన్ దాణాగా ఉపయోగపడుతుందని తెలిపారు. రెండరింగ్ ప్లాంట్ బై ప్రొడక్ట్‌లు సబ్బుల తయారీ, పరిశ్రమలు, వాహనాల లూబ్రికెంట్‌లుగా కూడా ఉపయోగపడుతాయి. అంతేగాక మృతిచెందిన జంతువులను నాలాలు, ఇతర ప్రాంతాల్లో పడవేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, అటువంటి జంతువులను సేకరించి రెండరింగ్ ప్లాంట్‌కు తరలిస్తున్నారని తెలిపారు. చెంగిచర్ల రెండరింగ్ ప్లాంట్‌లో ప్రతి 8గంటలకు 80 మెట్రిక్ టన్నుల కబేళాల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ రెండరింగ్ ప్లాంట్ వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో జియాగూడలో నిర్మాణంలో ఉన్న కబేళా నుండి వ్యర్థాలు కూడా చెంగిచర్ల ప్లాంట్‌కు వస్తాయి. ఈ కబేళా వ్యర్థాల నుండి వాణిజ్య పరంగా కూడా ఆదాయం సమకూరుతుందని అన్నారు.
ఈ పర్యటనలో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా.పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.ఇ వెంకటరమణ, రాంకీ నిర్మాణ సంస్థ ప్రతినిధి గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.