బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రంపై కన్నెర్రజేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సభలో ప్రకటించిన సాయంత్రంలోపే అన్నంత పని చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆమె… ఇందుకు సంబంధించిన లేఖను ఆమె రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి పంపారు. ఇవాళ రాజ్యసభలో షహరాన్‌పూర్‌లో దళితులపై జరిగిన దాడి ఘటనను మాయావతి లేవనెత్తారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. చేతిలో ఉన్న పత్రాలను ఆవేశంగా విసిరేస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు వినిపించాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె దళితుల గురించి మాట్లాడేందుకు తాను నిలబడగానే తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పక్ష సభ్యులు పైకి లేచి నిలబడ్డారని ఆమె తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. దేశంలోని దళితులు వెనకబడిన వర్గాల వారి సమస్యలను ప్రస్తావించే అవకాశం రానప్పుడు తనకు రాజ్యసభలో కొనసాగే అధికారం లేదని వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సభ్యురాలిగా మాయావతి పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియాల్సి ఉంది. ప్రస్తుతం యూపీలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం చూస్తే.. ఆమె మళ్లీ రాజ్యసభకు వెళ్లడం అసాధ్యం. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆమె మళ్లీ రాజ్యసభకు వెళ్లాలంటే కాంగ్రెస్ లేదా తన ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తప్పనిసరి.