సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్) ఆధ్వర్యంలో శ్రామిక దినోత్సవం మే డే ఘనంగా జరిగింది. సింగపూర్ లో పని చేస్తున్న 700 మంది పైచిలుకు కార్మికులను ఎస్.టి.ఎస్. ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ బాక్స్ లు అందజేశారు. కార్మికులకు అండగా ఉండటానికి కార్మికుల సహాయనిధి ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సెంబవాంగ్,కెన్టెక్, తువాస్, బుకిట్ బటోక్, మెగాయార్డ్, పెంజూరులో ఉన్న హాస్టల్స్ లో జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.టి.ఎస్ ప్రెసిడెంట్ కోటి రెడ్డి మాట్లాడుతూ…. కార్మిక సహాయ నిధిని అధికారికంగా ప్రారంభించారు. కార్మిక సహాయ నిది కి విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావలసిందిగా తెలుగు సమాజం సభ్యులను విజ్ఞప్తి చేశారు.అలాగే కార్మిక సోదరులకు “శ్రామిక దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎస్.టి.ఎస్. వైస్ ప్రెసిడెంట్, కార్యక్రమ నిర్వాహకులు జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… దాదాపుగా పది పైచిలుకు హాస్టల్స్ లో ఉన్న కార్మికులను కలసి గిఫ్ట్ బాటిల్స్ ఇచ్చామని, సింగపూర్ లో ఉన్న తెలుగు వారికి ఏదైనా ఆపద కలిగితే మా కార్యవర్గం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు.
కార్యదర్శి సత్య చిర్ల మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, కార్మిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.