బుధవారం తెల్లవారుజామున లండన్, వెస్ట్ ఎస్టేట్ లోని 27 అంతస్తుల గ్రెన్ ఫెల్ టవర్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ప్రమాద సమయంలో అత్యధికులు నిద్రిస్తుండటంతో, మృతుల సంఖ్య వందల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ భవంతి ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగసి పడుతున్న మంటలు అదుపులోకి రాకపోగా, పక్కనున్న భవనాలకు కూడా వ్యాపించాయి. గత అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా, 1974లో నిర్మించిన టవర్ లోని 120 ఫ్లాట్ లన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న 40 అగ్నిమాపక శకటాల సాయంతో 200 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ భవనంలో 120 ఫ్లాట్స్ ఉన్నాయి. భవంతిలోని రెండో అంతస్తు నుంచి 27వ అంతస్తు వరకూ మంటలు భారీగా వ్యాపించాయి. భవంతిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. తొలుత 200 మంది వరకూ ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటారని అంచనా వేసినప్పటికీ, మంటల్లో సజీవదహనమైన వారి సంఖ్య అంతకు మించే ఉంటుందని తెలుస్తోంది.
తమ కళ్ల ముందే ఎంతో మంది కాలి బూడిదై పోయారని, ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికీ కొన్ని ఫ్లాట్ల నుంచి సహాయం కోసం ప్రజల హాహాకారాలు వినిపిస్తుండగా, వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. ఈ భవనానం లోపలికి రాకపోకలు సాగించేందుకు ఒకే మార్గం ఉందని, ఈ విషయమై గతంలో హెచ్చరించినా, అపార్ట్ మెంట్ యాజమాన్యం పట్టించుకోలేదని అధికారులు వెల్లడించారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండటం ఆ మార్గంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో ఎవరూ బయటకు రాలేక పోయినట్టు తెలుస్తోంది.
ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సిటీ మెట్రోపాలిటన్ పోలీసు, లండన్ అంబులెన్స్ సర్వీసు విభాగాలు ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంతో భవంతిలోని అన్ని అంతస్తుల్లోకి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ఘటనను భారీ ప్రమాదంగా లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ ప్రకటించారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
https://youtu.be/xVAIweKNJ-w