భాగ్యనగరంతో పాటు తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. నేడు, రేపు, 8వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో లక్షలాది జంటలు వివాహ బంధంతో ఒకటవనున్నారు. నేడు ఒక్కరోజుు హైదరాబాద్ లో 30 వేల పెళ్లిళ్లు, ఏపీ, టీఎస్ లలో సుమారు లక్ష వివాహాలు జరుగుతున్నాయని అంచనా. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు మంచి ముహూర్తాలు కావడం, తిరిగి ఉగాది నుంచి వచ్చే విళంబి నామ సంవత్సరం శ్రీరామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండటంతో చాలా మంది ఈ మూడు రోజుల్లోనే వివాహాలను నిశ్చయించుకున్నారు.
ఇక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పెళ్లి మండపాలు, మ్యారేజ్ హాల్స్ నుంచి పురోహితుల వరకూ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. డిమాండ్ ను బట్టి రేట్లను నిర్ణయించే ఫంక్షన్ హాల్స్ సాధారణ రోజులతో పోలిస్తే భారీగా వసూలు చేస్తున్నారు. ఇక డిజైనర్లు, మేళగాళ్లు, కేటరింగ్ సంస్థలు కూడా తమకు వచ్చిన డిమాండ్ ను బట్టి అధికంగా గుంజుకుంటున్నారని తెలుస్తోంది.
నేడు పాల్గుణ బహుళ చవితి, హస్తా నక్షత్రంలో ఉదయం 7.29 నుంచి రాత్రి 10.50 వరకూ దివ్యమైన ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆపై 8వ తేదీన ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 మధ్య వివాహాలకు అనుకూల సమయాలున్నాయని, ఆపై మార్చి 27 వరకూ ముహూర్తాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇక వివాహ తంతు జరిపించగల పురోహితులకు ఎనలేని డిమాండ్ నెలకొంది. ఈ మూడు రోజుల్లో ఒక్కో పురోహితుడు 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది.