నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం వెంకటాద్రి భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. గత 20 రోజులుగా నష్టపరిహారం కోసం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు సాగిస్తున్న ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా నిర్వాసితులు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు జక్క రఘునందన్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి నిర్వాసితులతో తిమ్మాజిపేట వద్ద చర్చలు జరిపారు.
న్యాయమైన మీ కోరికలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇస్తున్న పరిహారం మీకు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
న్యాయమైన మీ కోరికలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి,15 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తారని నచ్చజెప్పడంతో నిర్వాసితులు పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. అనంతరం అక్కడే భూ నిర్వాసితులతో కలసి భోజనం చేసి భూ నిర్వాసితులను వారి వారి తాండలకు పంపించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.