గన్నీ సంచుల కొరతను అధిగమించాలి- మారెడ్డి

366
mareddy
- Advertisement -

రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న పాత గన్నీ సంచులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్య సేకరణకు గన్నీ సంచులు ప్రధానమనే విషయాన్ని అధికారులు మరవొద్దని, ఒక్క గన్నీ సంచి కూడా బయటికి వెళ్లడానికి వీల్లేదని, సంచుల సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని సూచించారు. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గన్నీ సంచుల కొరతపై మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్ లో చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

ఈ ఏడాది యాసంగిలో ధాన్య సేకరణకు పౌరసరఫరాల సంస్థకు దాదాపు 20 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయన్నారు. అయితే కోవిడ్-19 నియంత్రణకు లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ నుంచి అనుకున్న సమయానికి కొత్త గన్నీ సంచులు రాకపోవడం, అలాగే పాత గన్నీ సంచుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో సంచుల కొరత ఏర్పడిందన్నారు. కొత్త గన్నీ సంచులు వచ్చే అవకాశం లేదని, పాత గన్నీ సంచులనే సమకూర్చుకోవాలని, ఇందుకు కావాల్సిన కార్యాచరణను స్థానికంగా అధికారులు రూపొందించుకోవాలన్నారు.

గన్నీ సంచుల కొరతను అధిగమించేందుకు ఒకవైపు రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్ల దగ్గర ఉన్న పాత గన్నీ సంచులను తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, మరోవైపు పాత గన్నీ సంచుల సప్లయర్స్ నుంచి సంచులను సేకరించాలి. ఇందుకు వారికి ఎదురవతున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే పౌరసరఫరాల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లతో చర్చించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంచులను స్వాధీనం చేసుకోవాలని, అలాగే రోజువారీగా మానిటరింగ్ చేయాలన్నారు. స్టోరేజ్ సమస్య రాకుండా మిల్లర్లు, డీలర్ల నుంచి సేకరించిన గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకోవాలన్నారు.

ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను ఒక సవాలుగా తీసుకొని రైతులు గన్నీ సంచుల కోసం ఎదురు చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్య సేకరణకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రూ. 25 వేల కోట్లను సమకూర్చారని, ఎలాంటి నిధుల కొరత లేదని, రవాణా కాంట్రాక్టర్లు, గన్నీ సప్లయిర్స్, రేషన్ డీలర్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని సూచించారు. అలాగే రేషన్ డీలర్ల నుంచి తీసుకొనే ఒక్కో గన్నీ సంచి ధరను రూ. 16 నుంచి రూ. 18కి పెంచడం జరిగిందని తెలిపారు.

ఏప్రిల్ నెల రేషన్‌కు సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వడంతో డీలర్ల దగ్గర దాదాపు 60 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వెంటనే తీసుకునే ఏర్పాటు చేయాలి. పాత గన్నీ సంచుల పంపిణీదారులతో చర్చించి తక్షణమే సరఫరాకు చర్యలు చేపట్టాలి. ఇతర రాష్ట్రాల నుంచి గన్నీ సంచుల రవాణాకు కావాల్సిన ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. ఈ సంచుల రవాణాలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

- Advertisement -