రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతాంగం ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల సంస్ధ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు పౌర సరఫరాల భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంబిస్తున్నామని, ఇప్పటి వరకు 3,074 కేంద్రాల ద్వారా 80 వేల మంది రైతుల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేసాని తెలిపారు.
మిర్యాలగూడలో ప్రత్యేకమైన పరిస్దితులు వున్నాయని, ఇక్కడ పెద్ద ఎత్తున రైస్ మిల్లులు వుండటం, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 తేమ శాతం వుండాల్సి వుండగా అక్కడి మిల్లర్లు 23 నుంచి 26 శాతం వరకు తేమ వున్నప్పటికీ సన్నరకపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 1880 వుండగా మిల్లర్లు క్వింటాల్ కు రూ 82 అధికంగా పెట్టి క్వింటాల్ కు రూ 1970 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
దీంతో పక్క జిల్లాలైన సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, జనగాం, జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి సన్న ధాన్యం అమ్ముకుంటున్నారు. మిల్లుల సామర్ధ్యానికి కంటే అధికంగా ధాన్యం వస్తుంది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో రోజుకు 1500 వాహనాలు వస్తుండేటివి. ఇప్పుడు 4 వేల నుంచి 5 వేల వాహనాలు వస్తుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ ఏర్పడింది. రైతులు ఆందోళన చెందవద్దు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 1.25 లక్షల టన్నుల సన్నాలను మిల్లర్లు కొనుగోలు చేశారు. పౌర సరఫరాల సంస్ధ నల్గొండ జిల్లాలో 177 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినది. మరియు సూర్యాపేటలో 302 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు 6,491
ఇప్పటి వరకు ప్రారంభించినవి 3,074
కొనుగోలు చేసిన ధాన్యం 4,22, 853
రైతుల సంఖ్య 73,982
ఇప్పటి వరకు చెల్లింపులు చేసింది 254 కోట్లు