ఢిల్లీ వాయు కాలుష్యంపై ఇండియా గేట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన నిరసన అనూహ్యంగా వివాదంగా మారింది. నిరసనకారుల్లో కొందరు మడ్వీ హిడ్మా పోస్టర్లను ప్రదర్శించడం, అతన్ని ప్రశంసించే నినాదాలు వినిపించడం రాజకీయ దుమారం రేపింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, C-హెక్సాగన్ ప్రాంతంలో నిరసనకారులు ఢిల్లీ విషపూరిత వాయువులపై నినాదాలు చేస్తున్నారు. వారిలో ఒకరు మడ్వీ హిడ్మా చిత్రం ఉన్న పోస్టర్‌ను పట్టుకుని కనిపించారు. ఆయన తలపై రూ. 1 కోటి రివార్డు ఉండేది. నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
కాలుష్య నిరసనలో ఆయన పోస్టర్ కనిపించటం అధికారులను అయోమయంలోకి నెట్టింది. మొత్తం 15 మంది నిరసనకారులను విధుల్లో ఉన్న అధికారులపై దాడి చేసినందుకు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో AQI తీవ్ర స్థాయికి చేరడంతో “టాక్సిక్ ఎయిర్ ఎమర్జెన్సీ”పై మొదట నిరసన జరిగింది. కానీ హిడ్మా పోస్టర్ కనిపించటం, పోలీసులతో ఘర్షణ జరగటం మూలంగా మొత్తం సందేశం రాజకీయ వివాదంలో మునిగిపోయింది.
Also Read:బీహార్‌లో ఎన్డీఏకు మద్దతు:ఓవైసీ
DCP దేవేశ్ కుమార్ మహ్లా ప్రకారం, చిల్లీ స్ప్రే వినియోగం, హిడ్మా పోస్టర్లు ప్రదర్శించడం, రోడ్డు దిగ్బంధనాలు వంటి అంశాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. CCTV ఫుటేజ్, సోషల్ మీడియా వీడియోలు, అరెస్టయిన వారి నేపథ్యాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని సూచించారు.

