ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులను అమ్మాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత వివాదంగా మారింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆస్తులను వేలానికి పెట్టడంపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉండే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ హీరో మంచు మనోజ్ కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియజేయాలని బహిరంగంగా అడిగారు. ఈ మేరకు సోమవారం ఈ మంచు హీరో ఒక లేఖను ట్వీట్ చేశాడు.
ఓం నమో వేంకటేశాయ..
టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?..కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా?..చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి.
కొండపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే “గోవిందా గోవిందా” అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది.
మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే. ఏమీ లేదు సార్. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్.. అంటు హీరో మనోజ్ మంచు లేఖలో పేర్కొన్నారు.
#TTD 🙏🏻 pic.twitter.com/71PaFMPWbz
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 25, 2020