తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ వ్యవహారాలపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ ఆయన పలు ఆధారాలను బయటపెట్టారు.
కేవలం రూ. 1 లక్ష ప్రారంభ మూలధనం (షేర్ల విలువ) తో ఈ ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సిస్టమ్స్ (Aerospace & Defence Systems) తయారీ విభాగానికి చెందినదని చూపుతున్నారు. అయితే, భారత ప్రభుత్వ డీపీఐఐటీ (DPIIT) నిబంధనల ప్రకారం డిఫెన్స్ రక్షణ పరికరాల తయారీకి విధిగా ప్రత్యేక లైసెన్స్ ఉండాలి. ఈ కంపెనీ వద్ద ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేవు.
పటాన్‌చెరులోని శ్రీకృష్ణ నగర్‌లోని ఒక సాధారణ నివాస గృహంలో (ఇంట్లో) ఈ కంపెనీ చిరునామా నమోదు చేసి నడుపుతున్నారు. అత్యంత విచిత్రమేమిటంటే ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా పనిచేయడం లేదని క్రిశాంక్ తెలిపారు. కంపెనీలో ఎటువంటి ఉత్పత్తుల తయారీ జరగకపోయినా, అసలు సిబ్బందే లేకపోయినా విదేశాల నుంచి రూ. 1 కోటి ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆదాయం వచ్చినట్లు రికార్డుల్లో చూపించారని, దీని వెనుక భారీ మనీ ల్యాండరింగ్ కోణం ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
ఎలాంటి మౌలిక సదుపాయాలు, సిబ్బంది, అనుమతులు లేని కంపెనీకి విదేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు ఎలా వచ్చాయో ప్రభుత్వం మరియు విచారణ సంస్థలు తేల్చాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

