ఎన్నికల సమయంలో బీజేపీ వ్యూహాలు ప్రణాళికలు రాజకీయ వేడిని పెంచుతుంటాయి. ప్రజల్లో పార్టీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపిస్తున్న.. వాటిని అనుకూలంగా మార్చుకోవడంలో కమలనాథులు ముందు వరుసలో ఉంటారు. ఇక తెలంగాణలో సత్తా చాటాలని తెగ ప్రయత్నించిన కాషాయ పార్టీ వ్యూహాలు ఊహించని రీతిలో బెడిసికొట్టాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభావం చూపే దళిత, బీసీ ఓటర్లను ఆకర్షించేలా గట్టిగానే ప్లాన్ చేస్తూ వచ్చింది బీజేపీ పార్టీ. బీసీ అభ్యర్థిని సిఎం చేస్తామనిమ, దళితులలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఎస్సీ వర్గీకరణ చేస్తామని.. ఇలా గట్టిగానే హామీలు ప్రకటించింది. జాతీయ నేతలు కూడా వరుసబెట్టి రాష్ట్రంలో పర్యటించినప్పటికి ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. .
ఈ నేపథ్యంలో ఈసారి కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. కనీసం 36 శాతం ఓటు షేర్ తో 10 స్థానాల్లో నైన విజయం సాధించాలని చూస్తోంది. అందులో భాగంగానే మరోసారి వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంకు పై బీజేపీ గట్టిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే ఏంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కు వరంగల్ నుంచి లోక్ సభ సీటు ఇచ్చేందుకు బీజేపీ అడుగులు వేస్తోందట.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మందకృష్ణ మాదిగ అధికారికంగా బీజేపీలో చేరతారని టాక్ వినిపించింది. ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే ఆయనకు లోక్ సభ సీటు ఖాయంగా కనిపిస్తోంది. అయితే వరంగల్ సీటు విషయంలో బీజేపీ సీనియర్ నేతలు కృష్ణప్రసాద్, చింత సాంబమూర్తి వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. మరి వారిని కాదని మందకృష్ణకు సీటు కేటాయిస్తుందా ? లేదా అనేది చూడాలి. మొత్తానికి దళిత ఓటు బ్యాంకు కోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read:సీఎం రేవంత్‌తో బాలయ్య భేటీ