బుల్లితెరపై కనిపిస్తూ కూడా సినిమాల్లో బిజీ అయిపోతున్నారు ఇప్పటి నటీనటులు. అలా చాలామందే సినిమాల్లో అవకాశాలు సంపాధించుకున్నారు. సక్సస్ లూ రుచి చూస్తున్నారు. కానీ మొదటి నుంచే సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఆ అమ్మడుకి మాత్రం ఆ రుచి కాస్త దూరమవుతోంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనేగా మీ సందేహం..? అదేనండీ.. మంచులక్ష్మి.
ఓ వైపు బుల్లితెరపై హవా చాటుకుంటూ..మరోవైపు సినిమాలతోనూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది మంచు లక్ష్మి. ఈ అమ్మడు బుల్లితెర పై బాగానే సందడి చేస్తుందిగానీ.. మరో వైపు మాత్రం నిరాశగానే కనిపిస్తోంది. బుల్లితెరపై తప్ప ఈ భామకి సినిమాల్లో అంతగా కలిసిరావట్లేదేమోగానీ, లక్ష్మీ నటించిన ‘లక్ష్మీబాంబ్’ ఇంకా విడుదలకు నోచుకోలేదు.
కార్తికేయ గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిజానికి ఈ సినిమా నాలుగు నెలల కిందటే రెడీ అయింది. కానీ విడుదలకు మాత్రం ముహూర్తం రావడంలేదు. ఎన్నిసార్లు ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసినా అవి కాస్తా అటకెక్కుతున్నాయి. పోయిన దీపావళికే ‘లక్ష్మీబాంబు’ను పేలుద్దామనుకున్నారు. కానీ వాయిదా పడడంతో క్రిస్మస్ కానుకగా విడుదల చేసే ప్రయత్నం చేసినా అదీ జరగలేదు.
ఇలా వాయిదాల పరంపరను కొనసాగిస్తూ వస్తోంది ‘లక్ష్మీబాంబ్’. వీటన్నీటికీ కారణమేంటోగానీ.. ఇప్పుడు ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ అయ్యారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న ‘లక్ష్మీబాంబు’ను ప్రేక్షకుల ముందుకు తెస్తారట. అదే సమయంలో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘విన్నర్’, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన ‘యమన్’ కూడా అదే రోజు రిలీజవుతుంది. వీటి మధ్య ‘లక్ష్మీబాంబు’ పేలుతుందా ? లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అనేది చివరి వరకూ డౌటే.