తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి పథకానికి భారీగా స్పందన వస్తోంది. విరాళాల సేకరణలో భాగంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తుండగా తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు.
న్యూజెర్సీలోని ఎడిషన్ టౌన్ షిప్‌లో మన ఊరు – మన బడి ఎన్ఆర్ఐ పోర్టల్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు.ఈ యజ్ఞంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం రూ. 7,300 కోట్లు కేటాయించారని తెలిపారు.
దేశానికి ఆదాయం సమకూరుస్తున్న అతి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 4వ రాష్ట్రంగా ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందన్నారు. ఏడున్నరేండ్ల తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందన్నారు. తాను చెప్పేవన్నీ సొంత గణాంకాలు కాదు.. మోదీ గణాంకాలు అని కేటీఆర్ స్పష్టం చేశారు.