కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఝలక్ ఇచ్చాడు. గుజరాత్‌లోని ఆమ్రేలీలో నిర్వహించిన ఓ ఫంక్షన్ లో స్మృతి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరేశాడు. వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమ్రేలీలో వేడుక నిర్వహిస్తుండగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడికి అతిథిగా వచ్చారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు అనూహ్యంగా ఆమెపైకి విసిరాడు. అనంతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే, ఆ వ్యక్తికి స్మృతి ఇరానీకి మధ్య కాస్త దూరం ఉండటంతో ఆమెను తాకలేదు.
దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు. స్మృతి పై గాజులతో దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి భండారియా అనే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.
ఇంతకీ స్మృతి ఇరానీ పై దాడి చెయ్యడానికి కారణం మాత్రం … రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతడు అలా చేశాడని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు. రైతులపై రుణమాఫీ సరిగ్గా అమలు కాని నేపధ్యంలోనే ఆ వ్యక్తి అలా నిరసన తెలిపాడని అంటున్నారు. ఇక ఈ ఘటనతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.