పెద్ద నోట్ల చెలామణీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇపుడా పాతనోట్లను మార్చుకోవడానికి సామాన్యులు నానా కష్టాలు పడుతున్నారు. గత 11 రోజులుగా బ్యాంకులు, ఏటీఎం ముందు భారీగా క్యూలైన్లే దర్శనం ఇస్తున్నాయి. అవసరాలకు సరిపడా డబ్బు కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక అందరికీ పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు చేసేంత డబ్బు బ్యాంకుల దగ్గర కూడా లేకపోవడంతో రూ. 2000 మాత్రమే ఇచ్చి పంపిచేస్తున్నారు.
ఇక చిల్లర కొరత సామాన్యుల నుండి బ్యాంకుల వరకు పాకింది. బ‌్యాంకులు ఎంతగా చిల్లర కొరత ఎదుర్కొంటున్నాయో చెప్పడానికి ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చి బ్యాంకుకు వెళ్లిన ఓ వ్యక్తికి బ్యాంకు వారు అడిగినంత డబ్బు ఇచ్చారు. కానీ అన్ని నాణేలు ఇచ్చారు. మోయడం కష్టమే అయినా వాటిని కూడా కళ్లకు అద్దుకొని తీసుకెళ్లిపోయాడు. ఢిల్లీలోని జామియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో శుక్రవారం జరిగిందీ ఘటన.
ఇంతియాజ్ ఆలాం అనే వ్యక్తి బ్యాంక్ ముందు తన పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు ఎదురు చూశాడు. చివరికి కేవలం రెండు వేలు మాత్రమే మార్పిడి చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెప్పినా.. తనకున్న అత్యవసర పరిస్థితుల గురించి చెప్పడంతో 20 వేలు ఇవ్వడానికి వాళ్లు అంగీకరించారు. అయితే తమ దగ్గర నోట్లు లేవని, పది రూపాయల నాణేలు కావాలంటే ఇస్తామని, ఓ బ్యాగు నిండా కాయిన్స్ వేసి ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ఆ బ్యాంక్ ఏటీఎం పని చేయడం మానేసిందని.. బ్యాంకులో క్యాష్ కూడా తక్కువగా ఉండడంతో తనకు అన్నీ కాయిన్స్ ఇచ్చారని ఇంతియాజ్ తెలిపాడు.
వాటిని మోయడం కష్టమే అయినా.. అవి చెల్లుతాయి కాబట్టి వాటిని తీసుకున్నట్లు ఆలమ్ చెప్పాడు. ఇప్పటికే ఆ కాయిన్స్‌లో కొన్నింటిని రెస్టారెంట్ బిల్స్, క్యాబ్ ఖర్చులుగా చెల్లించాడు. ఇంకొంత మంది అయితే తమ దగ్గర ఉన్న రెండు వేల నోట్లు ఇస్తాం.. ఆ కాయిన్స్ ఇవ్వాలని కూడా ఆలమ్‌ను కోరడం విశేషం.