పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కొల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మమతా బెనర్జీ, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు భారంగా మారుతున్నాయని విమర్శించారు.
ఎల్పీజీ ధరలు మళ్లీ పెరగడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ కోసం ఇప్పుడు 21 రోజుల ముందుగానే బుకింగ్ చేయాలని చెప్పడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని మమతా బెనర్జీ అన్నారు. “ఇంట్లో గ్యాస్ అయిపోతే 21 రోజులు ఏమి వండుకుంటారు? ప్రజలకు ఇంటికే భోజనం పంపిస్తారా?” అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
అదే సమయంలో కిరోసిన్ కోటాను కూడా తగ్గించారని, రోజురోజుకు అవసరమైన వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎలా జీవించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. “బెంగాల్‌ను విభజించే ప్రయత్నాలు చేసినా అవి ఎప్పటికీ విజయవంతం కావు. ‘భంగ్ బెంగాల్’ అనే ప్లాన్ కేవలం ప్లాన్‌గా మాత్రమే మిగిలిపోతుంది” అని ఆమె స్పష్టం చేశారు.
Also Read:ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?

