మీ అంతం చూసే వరకు బతికే ఉంటా!

3
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం మధ్య ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే తన మరణాన్ని కోరుకున్నారని ఆరోపిస్తూ…మీ అంతం చూసే వరకు నేను బతికే ఉంటాను అని బీజేపీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన మమతా బెనర్జీ…ఎన్నికల ఫలితాల రోజు బీజేపీకి చెందిన కొందరు గుండెపోటుతో నేను చనిపోవాలని కోరుకున్నారు. కానీ మీ రాజకీయాలకు ముగింపు వచ్చే వరకు నేను బతికే ఉంటాను అన్నారు. తన వయసును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై కూడా మమత స్పందించారు. ఎవరినీ వయసు పేరుతో అవమానించొద్దు. అలాంటి రాజకీయాలు మంచివి కావు అని సూచించారు.

ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం తన పోరాటం ఆగదని మమత స్పష్టం చేశారు. మా వద్ద కార్యకర్తల కొరత లేదు. కొత్తవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం నేను నిరంతరం పోరాడుతాను అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ధీమా వ్యక్తం చేసిన మమత, “ఇప్పుడు మా వద్ద 18 మంది ఎంపీలు ఉన్నారు. కొందరిపై బెదిరింపులు కొనసాగుతున్నాయి. వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు. 2006లో పార్టీని మళ్లీ బలోపేతం చేసినట్లే, 2026లో కూడా తిరిగి నిర్మించగలను” అని అన్నారు.

Also Read:కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్‌ భేటీ

పార్టీలో తిరుగుబాటు కొనసాగుతున్న వేళ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మమత బెనర్జీ పూర్తి మద్దతు ప్రకటించారు. ద్రోహుల తరఫున ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మా కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీపడలేదు అని చెప్పారు. అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై స్పందిస్తూ…అభిషేక్‌ను ఒక సాకుగా మార్చారు. అతని కుటుంబ సభ్యులను కూడా విచారణలకు పిలిచారు. అతను కోరుకుని ఉంటే ఉపశమనం పొందేవాడు. కానీ పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదు. పులిలా పోరాడుతున్నాడు. అతని లోపాలన్నీ ప్రజలు క్షమించారు అని మమత వ్యాఖ్యానించారు.

- Advertisement -