పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. వరుసగా మూడో పర్యాయం బెంగాల్ పీఠం చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు సీఎం పగ్గాలు అందుకోనున్నారు. ఈ నెల 5న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇప్పటికే తృణమూల్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో దీదీ ఈరోజు రాత్రి గవర్నర్ ను కలవనున్నారు. ఈ మేరకు టీఎంసీ నేత పార్థ ఛటర్జీ మీడియా సమావేశంలో వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎనిమిది విడతల పాటు సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మమత ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా వంటి హేమాహేమీలు సైతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఎక్కడా తగ్గకుండా ఓ యోధురాలిగా పోరాటం చేశారు..