‘పద్మావతి’కి దీదీ మద్దతు..

204
- Advertisement -

సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావతి’ చిత్ర వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటామంటూ కర్ణిసేన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుపుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే `పద్మావతి` చిత్రాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మావతి’ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ సినిమాకు మద్దతు గా దీదీ ట్వీట్ చేశారు.

ఈ సినిమాపై కొనసాగుతున్న వివాదం దురదృష్టకరమని భావ ప్రకటనా స్వేచ్ఛను నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకోవడం దారుణమని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఇలాంటి హింసాత్మక శక్తులపై పోరాడేందుకు చిత్రపరిశ్రమ మొత్తం కలిసికట్టుగా నిలబడాలని మమతా బెనర్జీ సూచించారు. ఇప్పటికే పద్మావతికి సల్మాన్ ఖాన్ ఫర్హాన్ అక్తర్ ప్రకాష్ రాజ్ కరణ్ జోహర్ రాజ్ కుమార్ రావు వంటి సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.

Mamata Banerjee support to Padmavati

తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేయడంపై పలువురు బాలీవుడ్ సెలబ్రటీలు మండిపడుతున్నారు. శ్యామ్ బెనగల్ రితేష్ దేశ్ ముఖ్ షబానా అజ్మీ జావెద్ అక్తర్ లు ఈ వివాదంపై స్పందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కాకూడదని ఓట్ల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని అక్తర్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న ప్రభుత్వం…ఒక సినిమా విడుదల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. దీపికా భన్సాలీల తలలపై నజరానా ప్రకటించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోన్నయూపీ రాజస్థాన్ కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఆయన దుయ్యబట్టారు.

Mamata Banerjee support to Padmavati

సినిమా విడుదలను అడ్డుకోవడం నటీనటులను బెదిరించడం ఇది తొలిసారేమీ కాదని షబానా అజ్మీ అన్నారు. ఈ సారి పద్మావతి విషయంలో బాలీవుడ్ అంతా ఏకమై ప్రభుత్వం పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇపుడు తిరగబడకపోతే భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పవన్నారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ ఎఫ్ ఐ) వేడుకలకు అమితాబ్ సహా మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలు దూరంగా ఉండి ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని కోరారు.

ఐఎఫ్ ఎఫ్ ఐ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన షాహిద్ కపూర్ ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. ఇప్పటికే ఈ చిత్రంపై వివాదం తారస్థాయికి చేరిందని ఇది ఆవేశకావేశాలకు పోయే సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయాల్లో సంయమనం పాటించాలని త్వరలోనే ఆ చిత్రం విడుదలవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దీపిక భన్సాలీలపై కర్ణిసేన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

- Advertisement -