పెద్ద నోట్ల రద్దుపై ఢిల్లీలో విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్బుల్లా, బీజేపీ మిత్రపక్షమైన శివసేన పాల్గొన్నాయి. పెద్దనోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొనలేదు
మరోవైపు రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై పెద్ద చర్చజరిగింది. నోట్ల రద్దుపై కాంగ్రెస్ తీవ్రస్ధాయిలో మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. దేశాన్ని మొత్తం క్యూలో నిలబెట్టి ప్రభుత్వం నిద్రపోతుందని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మండిపడ్డారు. నల్లధనం ఉన్నవారి జాబితా ప్రభుత్వం వద్ద ఉంది.. వారి పేర్లను ఎందుకు భయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నల్లధనం అంటే ఏమిటో తెలపాలన్నారు. నగదు రహిత దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
తనను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని మోదీ అన్నారు. నోట్ల రద్దు చర్య వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని ప్రధాని అన్నారని, దేశం కోసం అన్నీ వదిలేశానన్నారు, కానీ ప్రధాని మాత్రం ప్రపంచం అంతా తిరుగుతున్నారు, అసలు ఆయన ఏం త్యాగం చేశారని శర్మ ప్రశ్నించారు.భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నల్లధనం మీదే నడుస్తుందా?.. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే అభిప్రాయం ఏర్పడిందని మండిపడ్డారు.
నోట్ల రద్దు గతంలోనూ జరిగిందని, స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా ఈ ప్రక్రియ జరిగిందన్నారు. అప్పట్లో ప్రజలకు కొంత సమయం ఇచ్చారని, కానీ ఈసారి అలా జరగలేదన్నారు. ప్రజలు కష్టపడి ఆర్జించిన సొమ్మును మీరు నల్లధనంగా మార్చేశారని ఆయన ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశంలో 500, వెయ్యి నోట్లే 86 శాతం ఉన్నాయి. వాటిని రద్దు చేయడం అంటే అవన్నీ నల్లధనమా అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. కనీస హెచ్చరికలు లేకుండానే నోట్ల రద్దును చేపట్టడాన్ని తప్పుపట్టారు.
నల్లధనానికి తాము వ్యతిరేకమని, ఉగ్రవాదానికి కూడా తాము వ్యతిరేకంగా ఉన్నామని ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. నోట్ల రద్దు చర్య వల్ల విదేశీ పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ చర్య వల్ల మన ఆర్థిక వ్యవస్థ అవినీతిమయమైందని, ప్రజల సొమ్మును లూటీ చేసి, అనాథలుగా మారుస్తున్నారన్నారు. నోట్ల రద్దు కోసం వెసలుబాటు కల్పిస్తే, ఉగ్రవాదులు ఆర్బీఐకి వెళ్లి నోట్లు మార్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ముంబైలోని ఓ ఏటీఎంను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న క్యాష్ బ్యాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లారా చూసి చకితులయ్యారు. ఒక్కొక్కరు క్యూలైన్‌లో గంటలతరబడి నిలుచోవడం చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రజలకు సహకరించాలని కోరారు. ప్రజలకు నోట్ల సమస్య రాకుడా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు వ్యాపారులు, రైతులు, కార్మికులతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు విషయంపై చర్చించనున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ జరిపించాలని కేజ్రీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీకి మేలు కలిగేందుకు మాత్రమే తీసుకున్న ఈ నోట్ల రద్దు నిర్ణయం పెద్ద మోసమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.