భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణా స్థల్’ వద్ద ఒక అరుదైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యం చోటుచేసుకుంది. రాజకీయంగా నిత్యం విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పరస్పరం చిరునవ్వుతో పలకరించుకున్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ ఆవరణలోని బాబాసాహెబ్ విగ్రహానికి ప్రధాని మోదీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా అక్కడికి చేరుకున్నారు. మహనీయుల స్మృతిలో ఏర్పాటు చేసిన ‘ప్రేరణా స్థల్’ వద్ద ఉభయ నాయకులు నివాళులు అర్పించారు.
నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ, ఖర్గే ఒకరినొకరు ఎదురయ్యారు. ఆ సమయంలో ఇద్దరు నేతలు ఎంతో గౌరవంగా పలకరించుకున్నారు.ఇద్దరు నేతలు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ చిరునవ్వులు చిందించారు.కొద్దిసేపు ఆగి పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు.ఎన్నికల వేళ రాజకీయంగా వాతావరణం వేడెక్కినప్పటికీ, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటుతూ ఇద్దరు దిగ్గజ నేతలు ఎంతో హుందాగా వ్యవహరించారు.
పార్లమెంట్ భవనం వెలుపల గతంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలన్నింటినీ ఒకే చోటికి చేర్చి ‘ప్రేరణా స్థల్’ పేరుతో ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చే సందర్శకులకు మరియు నాయకులకు దేశ నిర్మాతలు ఒకే చోట దర్శనమిచ్చి స్ఫూర్తిని నింపుతారు.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!
నరేంద్ర మోదీ, మల్లికార్జున్ ఖర్గే కలిసున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు.. శత్రువులు ఉండరు అని నెటిజన్లు ఈ దృశ్యాన్ని కొనియాడుతున్నారు.

