అక్రమమైతే తీసుకోండి..దౌర్జన్యం సరికాదు

217
minister
- Advertisement -

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండోరోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఫిర్యాదులతో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి నివాసాల్లోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.

గత 10 సంవత్సరాలుగా చెల్లించిన ఐటీ రిటర్న్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఐటీ దాడులపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని…. తన కొడుకును రాత్రంతా సీఆర్పీఎఫ్ వాళ్లతో కొట్టించినందుకే అతను హాస్పిటల్ పాలయ్యాడని ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రినన్న కారణంతోనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆస్తులు అమ్ముకోండి.. గుంజుకోండి… వేలం వేసుకోండి అంతేతప్ప ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదని అన్నారు. తన ఇల్లు, ఆఫీసులు, కాలేజీల్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదని చెప్పారు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి దాకా చూడలేదన్నారు.

కాలేజీలు పెట్టి సేవ చేస్తున్నామే తప్ప ఎలాంటి దొంగ వ్యాపారాలు, క్యాసినోలు నడపట్లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులు చేస్తున్నారన్న మల్లారెడ్డి.. 200 మంది అధికారులను పంపి భయపెడతారా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -