తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై పోలీసులు పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను లొట్టపీసు కేసులంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఎంపీ అర్వింద్ పటేల్ అగ్ర కులాంహకారంతో తమను కించపర్చాడంటూ దళితులు, గిరిజనులు మండిపడుతున్నారు. తాజాగా ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేసి దళితుల మనోభావాలను కించపరచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని… మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్నను జైల్లో కలిసేందుకు వెళ్లిన ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న మీద పోలీసులు పెట్టిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చాయని, కాని రెండు మూడు లొట్టపీసు కేసులు అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మాత్రమే ఉన్నాయంటూ అవహేళన చేశారు. దళితులకు రక్షణ కవచంగా పనిచేస్తున్న ఎస్సీ అట్రాసిటీ కేసు గురించి స్వయంగా ఓ ఎంపీ చులకనగా మాట్లాడడంతో దళితజాతి మనోభావాలు దెబ్బతిన్నాయని చెన్నయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు స్థానిక బస్టాండు చౌరస్తా వద్ద అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే దళితులకు, గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే అర్వింద్ ఇంటిని ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవమానించేలా అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందనే చెప్పాలి.