కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్లితే.. ‘భారతీయుడు-2’ చిత్రానికి సంబంధించి చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండగా నిన్న రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రమాదంపై స్పందించిన కమల్.. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.