టీకాంగ్రెస్ లో గత కొన్నాళ్లుగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. పార్టీలోని చాలమంది నేతలు ఎవరికివారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దాంతో పార్టీలో ఎవరు పార్టీలో ఉంటారు ? ఎవరు పార్టీని విడతారు ? అనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. గత ఏడాది కాలంగా పార్టీకి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నేతలతో పాటు ఇంకా చాలమందే పార్టీని విడారు. ఇక పార్టీ మారే లీస్త్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సీనియర్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా చేరబోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. .
గత కొన్ని రోజులుగా పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారాయన. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా సీనియర్స్ అందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డికి పోటీగా పాదయాత్ర కూడా చేపట్టారు. తన పాదయాత్రకు కూడా అధిష్టానం నుంచి అనుమతి ఉందని అందుకే పాదయాత్ర చేస్తున్నని గతంలో చెప్పుకొచ్చారు. కట్ చేస్తే మహేశ్వరరెడ్డి పాదయాత్రను విరమించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. దాంతో చేసేదేమీ లేక తన పాదయాత్రకు బ్రేక్ వేశారు మహేశ్వరరెడ్డి. ఇక అప్పటి నుంచి పార్టీ పై మరింత అసంతృప్తిగా ఉండడంతో.. మహేశ్వరరెడ్డి పార్టీ హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.
ఈ నేపథ్యంలో మహేశ్వరరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. దాంతో ఈ వ్యవహారంపై మరింత అగ్గిరాజుకుంది. తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం టీపీసీసీకి లేదని దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బై-లాస్ ప్రకారం ఇలా నోటీసులు ఇవ్వడం విరుద్దమని, పార్టీ కొరకు పని చేసిన తనకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ మహేశ్వరరెడ్డి ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే హస్తం పార్టీ వీడే అవకాశాలే కనిపిస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఆయన కాంగ్రెస్ వీడితే ఏ పార్టీ గూటికి చేరతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి…