టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనుండగా, ఈ చిత్రం భరత్ అను నేను టైటిల్ తో ప్రచారం జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలు కాగా, ప్రస్తుతం పిల్లలతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ భరత్ అనే నేను సెట్లో అడుగుపెట్టారు.
మహేష్, ఇతర తారాగణంపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో కొద్ది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాత కొరటాల టీం లండన్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్య మంత్రి పాత్రలో కనిపించనున్నాడని, అందుకోసం భారీ గడ్డం కూడా పెంచుతున్నాడనే టాక్ వినిపిస్తుంది.
అంతేకాదు ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ సెట్ ని భారీగా నిర్మించనున్నారట. అసెంబ్లీలో మహేష్ ప్రసంగించే సన్నివేశాలతో పాటు ముఖ్యమైన సీన్స్ ఇక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అను నేను చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11, 2018న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ నటిస్తోంది. శ్రీమంతుడు తర్వాత మహేష్ – కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.