‘బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’నిలిచింది. ఈ విషయాన్ని ఆర్కా మీడియాతో పాటు, బాహుబలి టీమ్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాహుబలి దర్శకుడు రాజమౌళిని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభినందించారు. ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమా 100 కోట్లరూపాయల వసూళ్లు సాధించడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదలతో అద్భుతమైన సినిమాను రూపొందించిన రాజమౌళి తెలుగువారిని గర్వపడేలా చేశారని ఆయన కొనియాడారు. ఇలాంటి విజయాలు రాజమౌళికి మరిన్ని దక్కాలని ఆయన అభిలషించారు.
‘భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద మైలురాయిని అతి పెద్ద చిత్రం సాధించింది’ ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. ‘అస్సలు ఊహకే అందనిది నిజమైంది. తెలుగు సినిమా పరిశ్రమను తలెత్తుకునేలా చేసినందుకు రాజమౌళి, అతని బృందానికి అభినందనలు’ అంటూ మహేశ్ బాబు ట్వీటు చేశారు.
బాహుబలి 2’ చూసి మూడు రోజులైంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాను కానీ ‘బాహుబలి’ సినిమా నుంచి బయటకు రాలేకపోయాను అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్వీటు చేశారు. ‘‘బాహుబలి కేవలం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కాదు. ‘పెద్ద కలలు నెరవేరాలంటే ఎక్కువ కష్టపడాలి. అప్పుడు ఎలాంటి లక్ష్యాన్నైనా సాధిస్తావు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు.. నువ్వు ఎవరు అనేది అసలు విషయమే కాదు’ అని బాహుబలి నిరూపించింది. అద్భుతమైన కథ, కథనాలు, విజువల్ ఎఫెక్ట్స్, దిమ్మతిరిగే నటన, అందమైన శిల్పంలా చెక్కిన జక్కన్న పర్‌ఫెక్షన్.. ఇవన్నీ ఈ చిత్రాన్ని సీట్ చివర్లో కూర్చొని చూసేలా చేశాయి. ఈ సినిమా చూసి ఎన్నిసార్లు క్లాప్స్‌కొట్టానో నాకే తెలియదు. చాలామంది కల కనే సాహసం చేయలేని లక్ష్యాన్ని సాధించిన రాజమౌళికి హ్యాట్సాఫ్’’ అన్నారు దేవి.
ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఓ ఎత్తయితే, దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్‌లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు. ఇందుకోసం వారు రాజమౌళి, అనుష్కను ఇంటర్వ్యూ చేశారు.