సాధారణంగా మహేష్ తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు మహేష్ హాజరుకాడన్న సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ కొరటాలతో చేయబోయే సినిమాను కూడా మహేష్ లేకుండానే మొదలు పెట్టారు. శ్రీమంతుడు చిత్రం లాంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన మహేష్, కొరటాల కాంబో త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం తాజాగా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక మహేష్‌కి బదులు నమ్రత ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని యూనిట్ భావిస్తోండగా టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సందేశాత్మక కథతో నిర్మించనున్న ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే కొరటాల ఇప్పటి వరకు తన సినిమాలకు టాప్ హీరోయిన్లనే సెలక్ట్ చేయగా ఈ సినిమాకు మాత్రం న్యూ హీరోయిన్ ని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట. కథ రీత్యా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నట్టు టాక్. మహేష్ 24వ చిత్రం ద్వారా కొరటాల అండ్ టీం మరో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంది.
కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక.