స్టార్ డైరెక్టర్ మురుగదాస్- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం స్పైడర్. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకి బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళ రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అభిమానులు టిక్కెట్స్ కోసం థియేటర్స్ దగ్గర క్యూలు కట్టారు.
‘స్పైడర్’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మహేశ్ బాబు కూడా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. తాజాగా ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో చేయడం ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నాడు.’మురుగదాస్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉన్నది. పదేళ్లుగా మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. కానీ డేట్స్ కలవకపోవడంతో ఇన్నాళ్లు కుదురలేదు. పోకిరి సినిమా చేస్తున్నప్పుడు ఆయన్ని కలిశాను. మురుగదాస్‌తో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. అంతిమంగా ఈ సినిమాతో ఆ కల తీరింది. శ్రీమంతుడు సమయంలో ఆయన ఈ కథను వినిపించారు. నాకు నచ్చింది. డ్రీమ్ కాంబినేషన్ నాకిది. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు మహేష్.
మురుగదాస్ సందేశాల్ని ఎప్పుడు వదలరని, ఈ కథలో అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుందన్నాడు. మురుగదాస్ సినిమాలు రెండు రకాలుగా ఉంటాయనీ, ‘రమణ’ .. ‘కత్తి’ వంటి ఎమోషన్స్ తో కూడిన సినిమాలు ఒక రకమని చెప్పాడు. ఇక స్టైలీష్ గా వుండే ‘గజని’ .. ‘ తుపాకి’ వంటి సినిమాలు రెండో రకమని అన్నాడు. ‘స్పైడర్’ వచ్చేసి రెండవ రకానికి చెందినదనీ .. దీనికి మురుగదాస్ తనదైన శైలిలో ఎమోషన్స్ ను కూడా జోడించాడని మహేశ్ చెప్పాడు.
యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో పాటు సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా సాగుతుందని మహేష్ తెలిపాడు. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని అన్నాడు. తన అభిమానులు అన్ని విధాలా సంతృప్తిని వ్యక్తం చేసే సినిమా ఇదని చెప్పుకొచ్చాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన స్పైడర్ చిత్రం వారం రోజులలో రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.