త్రివిక్ర‌మ్‌తో మరోసారి మహేష్‌..

107
mahesh

టాలీవుడ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో త్వరలో ఓ చిత్రం చేయబోతున్నట్టుగా హీరో మహేష్ బాబు ఈ రోజు ప్రకటించాడు. మ‌హేష్‌ బాబు-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రి క‌ల‌యికలో వ‌చ్చిన అత‌డు సినిమా ఇండ‌స్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖ‌లేజా చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయింది. అయితే త్రివిక్ర‌మ్ మార్కు డైలాగ్స్, మ‌హేష్‌ యాక్టింగ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ సినిమా విడుద‌లై నేటికి ప‌దేళ్లు పూర్తయింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు మహేష్‌ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఖలేజా వచ్చి పదేళ్లయింది. అందులో నాకు నేను ఆర్టిస్టుగా కొత్తగా కనిపించాను. ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. నా మంచి మిత్రుడు, బ్రిలియంట్ అయిన త్రివిక్రమ్ కి ఎన్నో కృతజ్ఞతలు. మా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను.. అది త్వరలోనే..” అంటూ మహేష్ పోస్ట్ పెట్టాడు. దీనిని బట్టి వీరిద్దరి కలయికలో త్వరలో ఓ సినిమా రానుందని మనం అర్థం చేసుకోవచ్చు..

మ‌హేష్‌ బాబు ట్వీట్ తో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రిత‌మే మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ కాంబినేష‌న్ తెర‌పైకి వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై మ‌హేష్‌ క్లారిటీ ఇవ్వ‌డంతో వీరిద్ద‌రి ప్రాజెక్టు ఎలాంటి కథాంశంతో రానుంద‌నేది తెలియాలంటే మ‌రికొంత‌కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్‌ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.