అల్లరి నరేష్ పూర్తి భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్నది.
ఈరోజు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘నాంది’ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేసిన మహేష్, “నాంది ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ట్రైలర్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. అల్లరి నరేష్‌కు, మొత్తం మూవీ టీమ్‌కు బ్లాక్‌బస్టర్ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నాను.” అని రాసుకొచ్చారు.
మహేష్ చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేసిన అల్లరి నరేష్, “మీ స్థిరమైన సపోర్ట్‌కు థ్యాంక్ యు మహేష్ గారూ..” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ టైటిల్ రోల్ చేసిన ‘మహర్షి’ మూవీలో ఆయన ఫ్రెండ్‌గా నరేష్ ఓ కీలక పాత్ర చేసిన విషయం, ఆ క్యారెక్టర్ నరేష్‌కు మంచి పేరు తేవడం తెలిసిందే.
ట్రైలర్ విషయానికి వస్తే, రాజగోపాల్ అనే ఓ పేరుపొందిన వ్యక్తి హత్యకు గురైతే, ఆ హత్యానేరం దానితో ఏ సంబంధమూ లేని సూర్యప్రకాష్ అనే యువకుడిపై పడుతుంది. అండర్ ట్రయల్ ఖైదీగా ఐదేళ్లు అతను జైలులోనే మగ్గిపోతాడు. అసలు హంతకులు సూర్యప్రకాష్ ఆ హత్య చేశాడని రుజువు చేయడానికి అన్ని రకాల అక్రమ మార్గాలు అనుసరిస్తారు. అతడిని నానా రకాలుగా హింసిస్తారు. చివరికి ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. గగుర్పాటు కలిగించే అనేక ఇంటెన్స్ సీన్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్‌గా కనిపిస్తోంది.
సూర్యప్రకాష్‌గా అల్లరి నరేష్ ఓ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. జైలులో కొంతమంది ఖైదీలను ఎంత ఘోరంగా హింసిస్తుంటారో నరేష్ చేసిన సూర్యప్రకాష్ పాత్ర ద్వారా డైరెక్టర్ తెలియజేసినట్లు అర్థమవుతుంది. తన కెరీర్‌లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్‌ను ఈ సినిమాలో నరేష్ పోషించారు. సూర్యప్రకాష్‌ను నిర్దోషిగా నిరూపించడానికి అతని తరపున వాదించే డిఫెన్స్ లాయర్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రాసిక్యూటర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించారు. కీలకమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో హరీష్ ఉత్తమన్, అల్లరి నరేష్ తండ్రిగా దేవీప్రసాద్ నటించారు.
బలమైన కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సమకూర్చిన మ్యూజిక్, సిద్ అందించిన సినిమాటోగ్రఫీ ఎస్సెట్‌గా నిలుస్తున్నాయని ట్రైలర్ తెలియజేస్తోంది.